హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైందంటే?

బ్రిటిష్ వలస పాలన నుంచి భారత్‌ విముక్తి పొందిన ఏడాదిన్నర తరువాత నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సమాఖ్యలో విలీనం అయ్యింది.

By అంజి  Published on  17 Sep 2023 2:04 AM GMT
Hyderabad kingdom, India, Operation Polo, Mir Usman Ali Khan

హైదరాబాద్ సంస్థానం భారత్‌లో ఎలా అంతర్భాగమైందంటే?

బ్రిటిష్ వలస పాలన నుంచి భారత్‌ విముక్తి పొందిన ఏడాదిన్నర తరువాత నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత సమాఖ్యలో విలీనం అయ్యింది. 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైంది. దీన్ని ఒకరు విమోచనమని, మరొకరు విలీనం అని అంటుంటారు. ఇంతకీ దాని చరిత్రేంటీ అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. భారత్‌కు స్వాతంత్ర్యం లభించిన తర్వాత 562 సంస్థానాలు స్వచ్ఛందంగా భారత్‌లో చేరాయి. కానీ కశ్మీర్‌, జునాగఢ్‌, హైదరాబాద్‌ సంస్థానాలు మాత్రం తాము స్వతంత్ర రాజ్యాలు ఉంటామని తేల్చి చెప్పాయి. అదే సమయంలో తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం ప్రారంభించారు. దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు చేపట్టారు. ఇది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరిలూదింది. అప్పటికి హైదరాబాద్‌ సంస్థానం ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ఆధీనంలో ఉంది.

హైదరాబాద్‌ను స్వతంత్ర్య రాజ్యంగా ఉంచాలని నిజాం విశ్వ ప్రయత్నాలు చేశారు. అప్పటికే హైదరాబాద్‌ సంస్థానానికి సొంత కరెన్సీ, సొంత రైల్వే, సొంత సైన్యం కూడా ఉంది. భారత్‌లో విలీనానికి సంబంధించిన ప్రతిపాదన నిజాం దగ్గరకు రాగా.. విలీనానికి టైం కావాలని, అప్పటి వరకు స్వతంత్రంగా ఉంటామని చెప్పారు. దీనికి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ అంగీకరించలేదు. భారత్‌తో చర్చల కోసం గడువు కోరిన నిజాం.. అప్పటికే పాకిస్తాన్‌కు రూ.20 కోట్లు ఇచ్చినట్టుగా ఆధారాలు లభించాయి. దీంతో పటేల్‌ నిజాంకు గడువు ఇవ్వడానికి నిరాకరించారు. నిజాంపై అనుమానం కూడా మొదలైంది. మరోవైపు నిజాం ప్రైవేట్‌ సైన్యమైన రజాకార్లు మారణ హోమం సృష్టించడం మొదలుపెట్టారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలో లక్షలాది మందితో భారీ కవాతు నిర్వహించి భారత ప్రభుత్వానికి హెచ్చరిక పంపాడు. నిజాం, రజాకార్ల ఆగడాలు హైదరాబాద్‌ను దాటి ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. దీంతో ఉపేక్షించి లాభం లేదని భావించిన పటేల్ హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిర్ణయించారు.

ఆ ఫలితమే భారత సైన్యం చేపట్టిన పోలీసు చర్య. దీన్నే 'ఆపరేషన్ పోలో'గా పిలుస్తారు. పటేల్ ఆర్డర్స్‌తో మేజర్‌ జనరల్‌ జేఎన్ చౌధురి నేతృత్వంలో ఆపరేషన్ పోలో 1948 సెప్టెంబర్ 13న మొదలై అదే నెల 18వ తేదీ సాయంత్రానికి పూర్తయింది. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత సైన్యం రెండు వైపుల నుంచి ముట్టడించింది. షోలాపూర్-హైదరాబాద్‌ మార్గంలో ప్రధాన బలగాలు రాగా.. విజయవాడ-హైదరాబాద్ మార్గంలో మరికొన్ని బలగాలు హైదరాబాద్‌పై పోలీసు చర్య చేపట్టాయి. మొదటి రెండు రోజులు నిజాం సైన్యం నుంచి ప్రతిఘటన ఎదురైనా ఆ తరువాత ఏమీ చేయలేకపోయారు. అయితే భారత ప్రభుత్వం మాత్రం.. ఈ ఆపరేషన్‌ చాలా రోజుల పాటు సాగుతుందని భావించింది. చివరికి 17వ తేదీ సాయంత్రం నిజాం సైన్యం భారత్‌ సైన్యానికి లొంగిపోయింది. అదే రోజు రాత్రి.. దక్కన్‌ రేడియాలో హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత దేశంలో విలీనం చేస్తున్నట్లు నిజాం ప్రకటించారు. దీంతో వేలాది మంది వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకాలు ఎగురవేశారు.

Next Story