ఈ నెల 15లోపు ఇళ్ల స్థలాలు.. రూ.5 లక్షల నగదు: మంత్రి పొంగులేటి హామీ

ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని...

By -  అంజి
Published on : 2 March 2026 7:21 AM IST

Minister Ponguleti Srinivas Reddy,Khammam Velugumatla Lands, Free House Sites,Indiramma Indlu Scheme, ₹5 Lakhs Financial Assistance, Bhoodan Lands Encroachment, Khammam Real Estate News, Telangana Government Housing Support

ఈ నెల 15లోపు ఇళ్ల స్థలాలు.. రూ.5 లక్షల నగదు: మంత్రి పొంగులేటి హామీ

ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల ప్రాంతంలో ఇళ్లు కోల్పోయిన అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఈ నెల 15వ తేదీలోపు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలంతో పాటు, ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని దగ్గరుండి ఇప్పిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. వెలుగుమట్ల భూదాన్ భూముల విషయంలో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

"భూదాన్ భూములపై మేము పక్కా ఆధారాలతోనే మాట్లాడుతున్నాం. ఒకవేళ ఈ ప్రక్రియలో అధికారులు ఎవరైనా తప్పు చేసి ఉంటే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కానీ, పేదలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి" అని ఆయన హితవు పలికారు. వెలుగుమట్ల గ్రామ సర్వే నంబర్లు 147, 148, 149లోని భూదాన్ భూముల్లో గతంలో నకిలీ పత్రాలతో అక్రమ కేటాయింపులు జరిగినట్లు రెవెన్యూ శాఖ విచారణలో తేలింది.

సీసీఎల్‌ఏ , హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 24న అధికారులు సుమారు 652 అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు మంత్ఇర తెలిపారు. ఈ ఆపరేషన్ ద్వారా సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రకటించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని, సంయమనం పాటించాలని పొంగులేటి కోరారు. ఇళ్లు కోల్పోయిన వారిలో నిజమైన నిరుపేదలను గుర్తించి, వారికి ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు మరియు నిధులు సకాలంలో అందేలా చూస్తానని ఆయన పునరుద్ఘాటించారు.

Next Story