మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆదివారం రాష్ట్రంలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులందరికీ సెలవు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం మార్చి 8వ తేదీన "అంతర్జాతీయ మహిళా దినోత్సవం"గా జరుపుకుంటున్నందున రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కూడా రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను జరుపుకోవడానికి, అనుకరించడానికి ఒక సందర్భమని రాజ్ భవన్ నుండి విడుదల చేసిన ఒక ప్రకటనలో గవర్నర్ తమిళిసై తెలిపారు. "శతాబ్దాలుగా మన వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు మహిళలను గౌరవిస్తాయి. వారిని శక్తి దేవత యొక్క ప్రతిరూపంగా ఆరాధిస్తాయి" అని ఆమె చెప్పారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. "అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2021 థీమ్ యొక్క నిజమైన స్ఫూర్తితో మనమందరం స్త్రీల సర్వతోముఖాభివృద్ధి, లింగ సమానత్వం కోసం సంకల్పించి కృషి చేద్దాం" అన్నారు.
మహిళలు అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారని, అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడి రాణిస్తున్నారని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు అన్నారు. జనాభాలో 50 శాతం ఉన్న మహిళలు తమకు అవకాశం ఇస్తే అద్భుతాలు చేస్తారని కేసీఆర్ తన కార్యాలయం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలను అభివృద్ధి, ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అలాగే మహిళా సాధికారత కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు చేపట్టామని కేసీఆర్ చెప్పారు.