హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు పరిస్థితి భయానకంగా మారడంతో విద్యా సంస్థలకు సెలవుపై అధికారులు కీలక ప్రకటన చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలకు డీఈవో ఈ రోజు సెలవు ప్రకటించారు. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాల పరిస్థితిని బట్టి స్కూళ్ల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని డీఈవో, ఎంఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. అటు హైదరాబాద్ జిల్లాలో ఈ రోజు హాలిడే ప్రకటిస్తున్నట్టు ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్‌లు పంపతున్నాయి.
పలు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం దంచికోడుతోంది. హైదరాబాద్ నగరంలో వర్ష బీభత్సంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. .దీంతో ఇళ్లలోకి నీరు పోటెత్తడంతో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ ఆదేశాల మేరకు సిబ్బంది చర్యలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పరిధి కృష్ణానగర్‌లో భారీ వర్షానికి ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఇంట్లోకి వచ్చిన నీటిని తోడేస్తూ కాలనీ వాసులు ఇబ్బంది పడుతున్నారు.