తెలంగాణ చరిత్రను మారుస్తామంటే ఊరుకునేది లేదు: కేటీఆర్

అంబేద్కర్ వారసత్వాన్ని లెగసీని సమాజానికి తెలవద్దని దురుద్దేశంతోనే అంబేద్కర్ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఆయన వర్ధంతి నిర్వహించడం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

By Kalasani Durgapraveen  Published on  6 Dec 2024 8:17 AM GMT
తెలంగాణ చరిత్రను మారుస్తామంటే ఊరుకునేది లేదు: కేటీఆర్

అంబేద్కర్ వారసత్వాన్ని లెగసీని సమాజానికి తెలవద్దని దురుద్దేశంతోనే అంబేద్కర్ వ్యతిరేక ఆలోచన విధానంతోనే ఆయన వర్ధంతి నిర్వహించడం లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం పూలమాల వేయాలన్న సోయి కూడా లేదన్నారు. దళితులందరికీ సమాజంలోని ప్రజలందరికీ స్ఫూర్తినిచ్చే అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. కేవలం కాంగ్రెస్ హై కమాండ్ ఉద్దేశాలతోనే అంబేద్కర్ విగ్రహానికి అవమానం చేస్తున్నారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రకాష్ అంబేద్కర్ చేత ప్రారంభించబడిన మహా విగ్రహానికి ఎందుకు అవమానం చేస్తుంది..తాళాలు వేసి బంధించి కనీసం శుభ్రపరచకుండా ఎందుకు పెట్టిందన్నారు.

బీఆర్ఎస్ పైన అక్కసు ఉంటే దానిని అంబేద్కర్ విగ్రహం పైన ఎందుకు చూపిస్తున్నారు.. అంబేద్కర్ కు నివాళులు అర్పించకుండా అడ్డుకుంటుంది. మమ్మల్ని కాదు అంబేద్కర్ వారసులను అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అన్నారు. అంబేద్కర్ కి నివాళులు కూడా అర్పించలేని ఇంగిత సంస్కారం లేని సంస్కారి రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రపంచం అబ్బురపడిన మహా మేధావి అంబేద్కర్ గారిని స్మరించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. అదే స్ఫూర్తితో దేశానికి ఒక గొప్ప సందేశం ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్న 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం పైన ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానానికి అంబేద్కర్ విగ్రహానికే కాదు.. దళితుల అభివృద్ధికి సైతం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదన్నారు.

దళిత బంధు పెంచి ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసింది. దళిత బంధు చెక్కులను రద్దుచేసి వారి జీవితాలను మారకుండా చేస్తున్నదన్నారు.పేద దళిత గిరిజన బహుజన బిడ్డలను ఉన్నత చదువుల కోసం గత ప్రభుత్వం విదేశాలకు పంపిస్తే... ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఓర్వలేక వారి ఓవర్సీస్ స్కాలర్షిప్పులను నిలిపివేశాడన్నారు. తెలంగాణ బిడ్డలు విదేశాల్లో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు.గురుకుల విద్యార్థులు మేము ఎవరెస్ట్ ఎక్కిస్తే ఈ ప్రభుత్వం వారిని పాడే ఎక్కిస్తుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివక్షను చేతగానితనాన్ని దాచిపెట్టడం కోసమే భారత రాష్ట్ర సమితి చేపట్టిన గురుకుల బాటను అడ్డుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి నాయకుల పైన కేసులు పెట్టిందన్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుని మాదిరిగా ఫోజులు కొడుతూ దేశంలో తిరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో తమను అడ్డుకున్న పోలీసుల పైన ఉక్రోషం వ్యక్తం చేసిన రాహుల్ గాంధీ , అదే హోదాలో ఉన్న ఎమ్మెల్యేలను శాసనసభ పక్ష నేతలను తెలంగాణ పోలీసులు అడ్డుకున్న విషయాన్ని గుర్తించాలన్నారు. నిజంగానే రాహుల్ గాంధీకి రాజ్యాంగం పైన ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు పైన సద్బుద్ధి ప్రసాదించాలని సూచించాలన్నారు.

రానున్న అసెంబ్లీ సమావేశాలను కనీసం నెల రోజులపాటు నిర్వహించాలన్నారు. 11 నెలల కాలంలో ఈ రాష్ట్రం సబ్బండ వర్గాలకు చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తాము. లగచర్ల అంశం నుంచి మొదలుకొని రాష్ట్రంలో కొనసాగుతున్న ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలులో వైఫల్యం, వ్యవసాయ రంగ సంక్షేపం బట్టి ప్రతి అంశం పైన ప్రజా సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు.

మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ ప్రధాత కేసిఆర్ గారి పైన కాకికూతలు కారుకూతలు మానకుంటే ముఖ్యమంత్రి కి ముఖ్యమంత్రి పదవికి కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యమకాలంలో సబ్బండ వర్గాలు, కవులు, కళాకారులు, మేధావులు అంతా కలిసి తెలంగాణ పరిస్థితిలకు అనుగుణంగా సంస్కృతికి అనుగుణంగా రూపం ఇచ్చిన తల్లి విగ్రహమే తెలంగాణ తల్లి అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి రూపు మారుస్తానని తెలంగాణ చరిత్రను మారుస్తానని నీచమైన మనస్తత్వంతో ఈ కుటీల ప్రయత్నం చేస్తున్నారన్నారు.

అమరవీరుల స్తూపానికి.. అంబేద్కర్ సచివాలయానికి మధ్యన ఉండాల్సింది కచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం అన్నారు. తెలంగాణ చరిత్రను మారుస్తామంటే ఊరుకునేది లేదన్నారు.

Next Story