యాదాద్రిలో ఉద్రిక్తత.. బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ నిరసన

High tension in Yadadri.. TRS protest saying Bandi Sanjay go back. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను యాదాద్రికి రాకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు

By అంజి  Published on  28 Oct 2022 1:08 PM IST
యాదాద్రిలో ఉద్రిక్తత.. బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ నిరసన

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను యాదాద్రికి రాకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడంతో శుక్రవారం యాదాద్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన తర్వాత, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధం లేదని యాదాద్రి ఆలయంలో స్వామివారి ముందు ప్రమాణం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్ విసిరారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రమాణం చేసి పార్టీ నిజాయితీని నిరూపించుకుంటానని అన్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ మర్రిగూడ నుంచి యాదాద్రి వరకు బయలుదేరారు. యాదాద్రికి వెళ్లకుండా బీజేపీ నేతలు, క్యాడర్‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు.

మరోవైపు బండి సంజయ్‌ యాదాద్రి పర్యటనకు వ్యతిరేకంగా స్థానిక టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు యాదాద్రిలో ర్యాలీ తీశారు. బండి సంజయ్‌ గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. నల్ల జెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సంజయ్‌ యాత్రను ఎలాగైనా అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నాయి. ఇరు పార్టీల పోటాపోటీ కార్యక్రమాలతో యాదగిరిగుట్ట పోలీసులు అప్రమత్తమయ్యారు. యాదాద్రి ప్రధాన మార్గాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

ఇదిలా ఉంటే.. మర్రిగూడలో బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు కొందరు ప్రయత్నించింది నిజమైతే, పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎక్కడిదని అన్నారు. ఈ కుట్ర, ఇందులో భాజపా ప్రమేయం ఏంటి, ఇందులో ఎవరెవరు ప్రమేయం ఉందన్న వివరాలు వెల్లడించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కోరారు. మునుగోడు ఉప ఎన్నికతో ఈ అంశం ముడిపడి ఉన్నందున తాము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని సంజయ్ తెలిపారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఎప్పటికీ గెలవదు అందుకే డ్రామాలాడుతున్నారన్నారు.

Next Story