మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి గుట్ట వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ స్థలాల్లో ప్రభుత్వం సఖి కేంద్రం నిర్మాణం చేపడుతుందని.. ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని.. మరో మహిళ పిల్లర్ గుంటలోకి దిగి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే స్పందించిన పోలీసులు అడ్డుకొని ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆవేశంతో ఉన్న ఓ మహిళ తహసీల్దార్ రంజిత్ కుమార్ పై దాడి చేసింది. అక్కడే ఉన్న పోలీసులు మహిళను అడ్డుకున్నారు.
సర్వే నెంబర్ 287లో ఉన్న స్థలాన్ని 2014లో కొండ బిక్షం, గంగారబోయిన సుభద్ర, దేవిశెట్టి రామచంద్రయ్య కొనుగోలు చేశారు. ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి.. ప్రభుత్వ స్థలమని అధికారులు తెలిపారు. సదరు స్థలాన్ని సఖి కేంద్రం నిర్మాణానికి కేటాయించారు. 4 నెలల క్రితం ఈ స్థలంలో సఖి కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వచ్చిన సమయంలో కూడా బాధితులు అప్పుడు కూడా ఆత్మహత్యకు యత్నించగా.. నాయకులు వెనుదిరిగారు.
నేడు పోలీసు బందోబస్తుతో జేసీబీతో పిల్లర్ గుంటలు తీస్తుండగా.. బాధితులు మళ్లీ అడ్డుకున్నారు. ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తనకు తండ్రి లేడని, తల్లి కష్టపడి కూలీనాలీ చేసి 2014లో ఈ స్థలాన్ని కొనుగోలు చేశిందని బాధితురాలి కూతురు శిరీష ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడేమో.. అధికారులు వచ్చి ఈ స్థలం ప్రభుత్వానిదేనని బలవంతంగా నిర్మాణాలు చేపట్టడం అన్యాయమని వాపోయింది.