ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ), పదవీ విరమణ వయసు పెంపు, తదితర సమస్యలపై ఈనెల 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆశించిన విషయం తెలిసిందే. ఇక టీఎన్జీవోల రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ను బీఆర్‌కేఆర్ భవన్ కు పిలిచి చర్చలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఉద్యోగం సంఘాలు చర్చలకు ఎప్పుడు వస్తాయో నిర్ణయించుకుని చెప్పాలని ఆయన కోరారు.
ఈ నేపథ్యంలో అన్ని ఉద్యోగ సంఘాలతో చర్చించి తేదీ తెలియజేస్తామని సీఎస్‌కు తెలిపారు. వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈనెల 27న త్రిసభ్య కమిటీతో సమావేశం జరపాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. దీంతో అదే రోజు సీఎస్ సోమేష్ కుమార్ ఉద్యోగ సంఘాల చేతికి పీఆర్సీ నివేదికను అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 27న చర్చలు విజయవంతం అయితే సీఎస్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చర్చల వివరాలను నివేదించనున్నారు.