ఫీజులు పెంచేది లేదు..ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.
By Knakam Karthik
ఫీజులు పెంచేది లేదు..ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైకోర్టు షాక్
రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది.ఫీజులు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వాలని ఆయా కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై టీఏఎఫ్‌ఆర్‌సీ (తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ) నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. 6 వారాల్లో నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే ఫీజుల పెంపు ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల పెంపునకు సంబంధించి ఏటా ఓ తంతు నడుస్తోందంటూ టీఏఎఫ్‌ఆర్‌సీ తీరుపై నిన్న విచారణ సందర్భంగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏటా కాలేజీలు ఫీజుల పెంపునకు ప్రతిపాదనలు చేయడం, కౌన్సెలింగ్ పూర్తయి అడ్మిషన్‌లు చేపట్టేదాకా దానిపై టీఏఎఫ్‌ఆర్‌సీ సిఫారసులు చేయకపోవడం, కాలేజీలు కోర్టును ఆశ్రయించడం అన్నది ఏటా కొనసాగుతోందని వ్యాఖ్యానించింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో గత బ్లాక్ పీరియడ్ ఫీజులే 2025-26కు వర్తిస్తాయంటూ జారీ చేసిన జీవో 26ను సవాలు చేస్తూ గురునానక్, గోకరాజు రంగరాజు కాలేజీలతో పాటు సుమారు 11 కళాశాలలు గురువారం లంచ్ మోషన్ పిటిషన్‌లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టి మూడేళ్లకోసారి కాలేజీలను పరిశీలించి పెంపుపై నిర్ణయం తీసుకోలేకపోవడం సరికాదన్నారు. డిసెంబరులో ప్రతిపాదనలు వస్తే జూన్ వరకు నిర్ణయం తీసుకోలేదని, 15 మంది సభ్యులదాకా ఉన్న కమిటీ నిర్ణయంలో జాప్యమెందుకన్నారు. టీఏఎఫ్‌ఆర్‌సీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదని, కౌన్సెలింగ్ పూర్తయ్యాక పిటిషన్‌లు వేయడమేమిటని కాలేజీలను ప్రశ్నించారు.