బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. పార్టీ ఆఫీస్‌ కూల్చివేతకు కోర్టు ఆదేశం

తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది.

By Srikanth Gundamalla  Published on  18 Sept 2024 3:05 PM IST
బీఆర్ఎస్‌కు బిగ్‌షాక్.. పార్టీ ఆఫీస్‌ కూల్చివేతకు కోర్టు ఆదేశం

తెలంగాణ హైకోర్టు బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది. వారు వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నల్లగొండ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం హైకోర్టు ధర్మాసనం 15 రోజుల సమయం కూడా విధించింది.

నల్లగొండలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను అక్రమంగా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను కూల్చివేయాలని మున్సిపల్‌ శాఖ అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌ను కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు కూడా సిద్ధం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. బీఆర్ఎస్‌ అలర్ట్ అయ్యింది. వెంటనే ఈ తరహా చర్యలను ఆపేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది.

బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. పార్టీ ఆఫీస్‌ భవనాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్‌ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. పార్టీ ఆఫీస్ ను నిర్మించిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని ప్రశ్నించింది. కట్టక ముందు అనుమతి తీసుకోవాలి కానీ.. కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. 15 రోజుల్లో గా పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని నల్లగొండ మున్సిపల్ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. అలాగే లక్ష రూపాయల పరిహారం కూడా చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీని హైకోర్టు ఆదేశించింది.

Next Story