వ్యక్తి గత కక్షలతోనే వామన్‌రావు దంపతుల హత్య.. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
High Court Lawyer Vamanrao Murder Case. పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన న్యాయవాదుల హత్య కేసులో తవ్వే కొద్ది రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
By Medi Samrat Published on 24 Feb 2021 5:13 AM GMTపెద్దపల్లిలో సంచలనం సృష్టించిన న్యాయవాదుల హత్య కేసులో తవ్వే కొద్ది రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. న్యాయవాదులు వామన్‌రావు దంపతులను అనుసరించి వచ్చిన నిందితులు కొద్ది నిమిషాల్లోనే నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపి ఏమి జరగట్లే అక్కడి నుంచి జారుకున్నట్లు సీసీ కెమెరాలో వెల్లడైంది. ఆ రాత్రికి కారులోనే ప్రశాంతంగా నిద్రపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి వారు మంథనిలో న్యాయస్థానానికి అందజేసిన నిందితుల రిమాండ్‌లో పలు ఆసక్తికరమైన విషయలు బయటకు వచ్చాయి. కల్వచర్ల సమీపంలో వామన్‌రావు, నాగమణిలను హత్య చేసిన అనంతరం నిందితులు నేరుగా కారులో సుందిళ్ల బ్యారేజీకి చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తులతో పాటు రక్తసిక్తమైన తమ దుస్తులను బ్యారేజీలో పడేశారు. బ్యారేజీ నుంచి కారులో వాంకిడి చెక్‌పోస్టు వద్దకు చేరుకుని ఆ రాత్రి నిందితులు వాహనంలో పడుకున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రిమాండ్ రిపోర్టును బట్టి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని తెలుస్తోంది. ఈ మొత్తం కేసులో బిట్టు శ్రీను పాత్ర ఏమిటీ అనేది అతనికి సంబంధించి రిమాండ్ డైరీ ద్వారా వెల్లడయ్యే అవకాశం ఉంది.
కుంట శ్రీనుపై కేసులు, ఫిర్యాదుల గురించి వామన్‌రావు సోషల్ మీడియాలలో ప్రచారం చేస్తున్నారని ఇద్దరి మధ్య పలు మార్లు వాగ్వాదం కూడా జరిగినట్లు విచారణలో వెల్లడైంది. కుంట శ్రీను దీనిపై ఫోన్‌లో సైతం బెదిరించంతో వామన్‌రావు అతనిపై హైదరాబాద్ వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. మంథని ఠాణాలోనూ కుంట శ్రీనుపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. అయితే శ్రీను గుంజపడుగు బస్టాండ్ వద్ద స్థలాన్ని కొని భవనం, సమీపంలోనే గుడిని నిర్మిస్తున్నారు. దీంతో పాటు రాధాగోపాలస్వామి ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయగా, వీటన్నింటిని అడ్డుకునేందుకు వామన్‌రావు కేసులు వేయడంతో శ్రీను అతడికి మధ్య వివాదం రాజుకుంది. వామన్‌రావు విషయమై కుంట శ్రీను పలుమార్లు బిట్టు శ్రీనుతో చర్చించి చివరకు ఎలాగైన చంపేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే గుంజపడుగు గ్రామంలో ఈనెల 17న జరిగిన పార్టీ కార్యక్రమంలోపాల్గొన్న కుంట శ్రీను తర్వాత దుబ్బపల్లిలో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరయ్యారు. మంథని చౌరస్తాకు వచ్చేసరికి వామన్‌రావు దంపతులు కారులో మంథని కోర్టుకు వెళ్తుండగా కనిపించారు. వెంటనే బిట్టు శ్రీను ఫోన్ చేసి చెప్పారు. అతడు హత్య చేయడానికి కత్తులు, కారు, డ్రైవర్ చిరంజీవితో పాటు కోర్టు వద్ద రెక్కి నిర్వహించారు. ఇందుకు లచ్చయ్య, కుమార్లు ఏర్పాటు చేశారు.
కాల్ రికార్డులో ఏముంది..?
ఈ నెల 17న హత్యకు గురైన వామన్ రావు దంపతుల హత్య కేసులో ఇరువురి ఫోన్ సంభాషణ కూడా రికార్డు అయ్యాయి. కుంట శ్రీను, బిట్టు శ్రీను, లచ్చయ్య, అక్కపాక కుమార్‌ల మధ్య మొత్తం 18 సార్‌లు సెల్‌ఫోన్ సంభాషణలు నడిచాయి. బిట్టు శ్రీను-కుంట శ్రీను మధ్య 11 సార్లు, కుంట శ్రీను-వూదరి లచ్చయ్య మధ్య 5 సార్లు కాల్స్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. బిట్టు శ్రీను, కుంట శ్రీను చెరోసారి కుమార్‌తో మాట్లడారు.
శ్రీనుకు 14 రోజుల రిమాండ్
హత్య కేసులో నిందితుడు బిట్టు శ్రీను మంగళవారం అర్ధరాత్రి మంథని అడిషనల్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అతనికి కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. కరీంనగర్ జైలులోఉన్న కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌లను వరంగల్ కేంద్ర జైలుకు తరలించారు.