సిగాచీ పేలుళ్ల ఘటన దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం
సిగాచీ ఇండస్ట్రీస్‌లో పేలుళ్ల ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
By - అంజి |
సిగాచీ పేలుళ్ల ఘటన దర్యాప్తుపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: సిగాచీ ఇండస్ట్రీస్‌లో పేలుళ్ల ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా పోలీసుల విధి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.పేలుడులో 54 మంది కార్మికులు మృతి చెందారు అని గుర్తుచేస్తూ, “ఇది సాధారణ ఘటన కాదు. ఇంత భారీ ప్రాణ నష్టం జరిగిన ఘటనలో ఇప్పటికీ ‘దర్యాప్తు కొనసాగుతోంది’ అని చెప్పడం ఎలా?” అని కోర్టు ఏఏజీని ప్రశ్నించింది.
ఏఏజీ చేసిన ‘దర్యాప్తు కొనసాగుతోంది’ వ్యాఖ్యపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “237 మంది సాక్షుల్ని విచారించాం అనడం ఏం ప్రయోజనం? ఇంకా బాధ్యులు ఎవరో నిర్ణయించలేదా?” అని ప్రశ్నించింది. ఇంత భారీ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు అధికారి స్థాయిని కూడా కోర్టు ప్రశ్నించింది. “ఇంత పెద్ద ఘటనలో డీఎస్పీని దర్యాప్తు అధికారిగా ఎందుకు నియమించారు? ప్రత్యేక దర్యాప్తు బృందం ఎందుకు ఏర్పాటు చేయలేదు?” అని కోర్టు నిలదీసింది. కోర్టుపోలీసు దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి డీఎస్పీ స్వయంగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది. తదుపరి కేసు విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది.
పరిశ్రమ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉందని నిపుణుల కమిటీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.పేలుడు తీవ్రత వల్ల 8 మంది కార్మికుల శరీరాలు పూర్తిగా దగ్ధమై ఆనవాళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది.