Telangana: ప్రారంభానికి సిద్ధమైన మెగా డెయిరీ.. దీని ప్రత్యేకతలు ఇవే
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ విజయ ఫెడరేషన్ చెందిన మెగా డెయిరీ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. రూ.250 కోట్ల వ్యయంతో ఈ మెగా డెయిరీని నిర్మించారు.
By అంజి Published on 4 Oct 2023 5:17 AM GMTTelangana: ప్రారంభానికి సిద్ధమైన మెగా డెయిరీ.. దీని ప్రత్యేకతలు ఇవే
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ విజయ ఫెడరేషన్ చెందిన మెగా డెయిరీ ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద రూ.250 కోట్ల వ్యయంతో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ మెగా డెయిరీని నిర్మించారు. దీని నిర్వహణ కోసం సోలార్ వ్యవస్థతో పాటు వ్యర్థాల వినియోగం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం మంత్రి కేటీఆర్.. ఈ మెగా డెయిరీని ప్రారంభించనున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ సహకారంతో దేశంలోనే అత్యాధునిక, పూర్తిస్థాయి ఆటో మిషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో నిర్మించారు. రోజుకు 5 లక్షల 8 లీటర్ల పాలు ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం ఈ డెయిరీకి ఉంది.
ఈ మెగా డెయిరీ ద్వారా రోజుకు పాల ఉత్పత్తుల సామర్థ్యం కింది విధంగా ఉన్నాయి.
- పాల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ - 5 లక్షల నుంచి 8 లక్షల లీటర్లు
- పాల ఉత్పత్తి - లక్ష లీటర్ల టెట్రా బ్రిక్
- నెయ్యి ఉత్పత్తి - 10 టన్నులు
- ఐస్‌క్రీం - 5 వేల నుంచి 10 వేల లీటర్ల
- పెరుగు ఉత్పత్తి - 20 టన్నులు
- మజ్జిగ, లస్సీ తయారీ - 12 వేల లీటర్ల
- వెన్న తయారీ (నెలకు) - 30 టన్నులు
ఈ మెగా డెయిరీ ఏర్పాటు డెయిరీ చరిత్రలో ఓ మైలు రాయిగా నిలుస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు మూతపడే స్థితిలోకి వచ్చిన విజయ డెయిరీని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో లాభాల బాట పట్టిందన్నారు. గతంలో ఉన్న పాల ఉత్పత్తులతో పాటు నూతన ఉత్పత్తులు మార్కెట్‌లోకి తీసుకొచ్చామని చెప్పారు. పెద్ద సంఖ్యలో విజయ డెయిరీ ప్రొడక్ట్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పాడి రైతులను ప్రోత్సహించే విధంగా రాయితీపై పాడి గేదెల పంపిణీ, గడ్డి విత్తనాలు సరఫరా చేస్తుమని పేర్కొన్నారు. లీటర్ పాలకు రూ.4 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని విజయ డెయిరీకి పాలు సరఫరా చేసే రైతులకే కాకుండా.. ఇతర సహకార డెయిరీలకు చెందిన అన్నదాతలకు అందిస్తామని చెప్పారు.