మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సేవలు.. టిక్కెట్ ధరెంతో తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటైన మేడారం మహా జాతర ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను ప్రవేశపెట్టింది.
By అంజి Published on 19 Feb 2024 8:14 AM IST
మేడారం మహా జాతరకు హెలికాప్టర్ సేవలు.. టిక్కెట్ ధరెంతో తెలుసా?
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవాల్లో ఒకటైన మేడారం మహా జాతర ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం పర్యాటక శాఖ హెలికాప్టర్ సేవలను ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రభుత్వం బెంగుళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ ఈ హెలికాప్టర్ సర్వీస్‌లను నిర్వహిస్తోంది. ఈ సేవలను ఫిబ్రవరి 17వ తేదీ శనివారం ప్రారంభించారు. ప్రయాణీకులు ఒక రౌండ్ ట్రిప్‌తో సహా వీఐపీ దర్శనాన్ని పొందవచ్చు. ఒక్కో ప్యాసింజర్ (అప్ అండ్ డౌన్)కు వీఐపీ దర్శనం రూ. 28,999, జాతరలో ఏరియల్ వ్యూరైడ్ ఒక్కొక్కరికి రూ.4,800.
హనుమకొండ నుంచే రోడ్డు మార్గం ద్వారా మేడారానికి వెళ్లేందుకు 4-5 గంటలు పడుతుండటంతో జాతరకు త్వరగా వెళ్లి రావాలనుకునే భక్తు లు హైదరాబాద్, హనుమకొండ నుంచి ఈ హెలికాప్టర్ సేవలు వినియోగించుకోవచ్చు. 20 నుంచి 30 నిమిషాల్లో హనుమకొండ నుంచి మేడారానికి తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి మేడారానికి కూడా ప్యాకేజీని ప్రకటించారు. ఆరు సీట్ల సామర్థ్యం కలిగిన చాపర్‌లో ఒక్కరికి రూ.95,833 టికెట్ ధర ఉందని సంస్థ వెల్లడించింది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌ను నడిపించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు.
హెలికాప్టర్ టిక్కెట్లు, పూర్తి వివరాల కోసం వ్యక్తులు క్రింది ఫోన్ నంబర్‌లను సంప్రదించవచ్చు: 74834 33752, 04003 99999, లేదా infor@helitaxi.comలో ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చు. ఈ సేవలు ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పర్యాటక శాఖ పర్యవేక్షణలో కొనసాగుతాయి.
ప్రత్యేక బస్సులు, రైళ్లు
జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో హైదరాబాద్ నుంచి వరంగల్, ములుగు, మేడారానికి వెళ్లే దార్లు ట్రాఫిక్‌తో నిండిపోతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి ద్వైవార్షిక కార్యక్రమం కోసం మేడారం వెళ్లే భక్తులకు సహాయం చేయడానికి కేంద్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఫిబ్రవరి 21 నుండి ఫిబ్రవరి 24 వరకు వరంగల్‌కు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. మేడారంకు భక్తులకు సాఫీగా రవాణా సౌకర్యం కల్పించేందుకు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఫిబ్రవరి 21 మరియు 24 మధ్య సమ్మక్క సారలమ్మ జాతర కోసం అదనంగా 6,000 బస్సులను మోహరించనుంది.