తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల వేగం పుంజుకోవడంతో పాటు వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో సోమవారం అత్యధిక వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 9 సెంటీమీటర్లు కురిసినట్లు వెల్లడించింది.
నేడు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో 14 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. అదేవిధంగా.. బుధ, గురు, శుక్రవారాల్లోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కొనసాగుతాయని పేర్కొంది.