రాష్ట్ర‌మంతా కుంభ‌వృష్టి.. భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమ‌ట్టం

Heavy Rains in Telangana.అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో తెలంగాణ రాష్ట్రంలో గురువారం కుంభ‌వృష్టి కురిసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  23 July 2021 3:09 AM GMT
రాష్ట్ర‌మంతా కుంభ‌వృష్టి.. భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమ‌ట్టం

అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో తెలంగాణ రాష్ట్రంలో గురువారం కుంభ‌వృష్టి కురిసింది. భారీ వర్షం కురవడంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కుమురం భీం జిల్లా వాంకిడిలో 27.30 సెంటీమీట‌ర్ల వాన ప‌డింది. వంద‌ల గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. నిర్మ‌ల్‌, బైంసా ప‌ట్ట‌ణాలు నీట‌మునిగాయి. గోదావ‌రిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండ‌ల్లా ఉన్నాయి. శ్రీరామ్‌సాగ‌ర్ నుంచి మేడిగ‌డ్డ వ‌ర‌కు నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. మ‌రో రెండు రోజులు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ చెప్ప‌డంతో అధికార యంత్రాగం అప్ర‌మత్త‌మైంది.

నిర్మల్‌ జిల్లాలో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పట్టణంలో పలు కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 మంది జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో గజఈతగాళ్లు, రెస్క్యూ టీంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిర్మల్‌లో వరద పరిస్థితిపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌చేశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా చూడాలని ఆదేశించారు. సహాయ చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను నిర్మల్‌కు పంపుతామని తెలిపారు. నిర్మల్‌లోని పలు కాలనీలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అధికారులతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో వరద ప్రవాహం అధికమవుతున్నది. శుక్రవారం ఉదయం భద్రాచలం వద్ద 19.9 అడగుల మేర గోదావరి ప్రవహిస్తున్నది. ప్రస్తుతం నదిలో 1,84,396 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. కాగా, ఎడతెరపి లేని వర్షాల కారణంగా గోదావరిలో వరద మరింత పెరగనుందని సీడబ్ల్యూసీ సూచించింది. నదీ పరీవాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరిగిపోతుండటంతో అధికారులు అందుబాటులో ఉండాలిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు

పెదవాగులో చిక్కుకున్న కార్మికులు..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని పెంచికల్‌పేట్‌ మండలంలో పెదవాగు ఉప్పొంగుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో మండలంలోని ఎల్కపల్లి వద్ద పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో తొమ్మిది కార్మికులు వాగులో చిక్కుకుపోయారు. పెదవాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్మికులు వాగు ఒడ్డున శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా వాగులో వరద ప్రవాహం పెరగడంతో కార్మికులు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని నీరు చుట్టుముట్టింది. దీంతో కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. సహాయం కావాల్సినవారు కంట్రోల్‌ రూం నంబర్‌ 18004251939లో సంప్రదించాలని సూచించారు. ఉట్నూరు, నేరడిగొండ, బోథ్‌లో రెస్క్యూ బృందాలతో సహాయ చర్యలు ప్రారంభించారు.

Next Story
Share it