మరో మూడు రోజుల పాటు వానలే వానలు..!
Heavy Rainfall predicted in Telangana in next 3 days.తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం
By తోట వంశీ కుమార్ Published on 17 Oct 2021 10:52 AM ISTతెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 24గంటల్లో బలహీన పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు కురవనున్నాయి.
కాగా.. నిన్నటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం తీరం దాటి తెలంగాణపై నుంచి వెళ్తూ హైదరాబాద్ సహా పలుచోట్ల కుంభవృష్టి కురిపించింది. దీని ప్రభావంతో శనివారం అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నాలాలు, డ్రైనేజీలు పొంగి రోడ్లు.. చెరువుల్ని తలపించాయి.
దిల్‌సుఖ్‌నగర్, చింతలకుంట, ఎల్‌బీనగర్ ప్రాంతాల్లో రహదారిపై నిలిపి ఉంచిన పలు ద్విచక్రవాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఎల్బీనగర్‌లో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల రహదారులపై వరదనీరు ప్రవహించడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, జగిత్యాల, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఆయా జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకుపైనే వర్షపాతం నమోదైంది.