ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

Heavy rain lashes to Telangana for next five days. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆగస్టు 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

By అంజి  Published on  1 Aug 2022 10:49 AM GMT
ఐదు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆగస్టు 5 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల సోమ‌, మంగ‌ళ‌వారాల్లో రాష్ట్రంలో ప‌లు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ద్రోణి కొమ‌రిన్ ప్రాంతం వ‌ర‌కూ విస్త‌రించి ఉన్న‌ట్లు చెప్పింది.

ఇవాళ యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. ఎల్లుండి ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ఈ నెల 4న కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 5న రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్ మహానగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Next Story