బిగ్ అలర్ట్: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Heavy rain forecast for Telugu states. ఐదు రోజుల నుంచి తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.
By అంజి Published on 12 July 2022 11:34 AM ISTతెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు
ఐదు రోజుల నుంచి తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా దక్షిణ జిల్లాల్లో ముసురు కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. జిల్లాల యంత్రాంగాలు అలర్ట్‌గా ఉండాలని సూచించింది.
అల్పపీడనం మరికొన్ని గంటల్లో మరింత బలపడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాని ప్రభావంతో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. రానున్న రెండు రోజుల్లో ఇది మరింతగా బలపుడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతోపాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీని ప్రభావం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఏన్టీఆర్, గుంటూరు జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. రేపు అక్కడక్కడా భారీ వర్షాలు, ఎల్లుండి పలుచోట్ల మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది.