భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం నది ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద వస్తుండటంతో కడెం ప్రాజెక్టు 16 గేట్లను అధికారులు ఎత్తారు. దీంతో 1,80,000 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. నిర్మల్ జిల్లాలోని స్వర్ణ జలాశయానికి కూడా వరద పోటెత్తింది. దీంతో 3 గేట్లు ఎత్తి 14 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. భారీ వర్షాలతో పొచ్చెర జలాశయానికి కూడా వరద ప్రవహం పెరిగింది. అటు మెదక్ జిల్లాలో మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఏడుపాయల ఆలయం మూడు రోజులుగా నీటిలో ఉంది. రాజగోపురంలో అమ్మవారికి పూజలు చేస్తున్నారు.
జురాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 1,81,256 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,72,800 క్యూసెక్కులుగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.10 అడుగులుగా ఉంది. అటు నాగార్జునసాగర్ 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పెరిగింది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద 3.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.