హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలో వెయ్యికి పైగా చెట్లు కొట్టివేతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సుమోటో విచారణ చేపట్టింది. కాగా ఈ భూముల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలపై గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఈ భూముల అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలించిన సీజేఐ జస్టిస్ బీఅర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకోసం చర్యలు తీసుకోవాలి. పర్యావరణం కోసం రాష్ట్రం చేస్తున్న చర్యలను అభినందిస్తున్నాం. అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు.. పర్యావరణాన్ని సమతుల్యం చెయ్యాలి. పర్యావరణాన్ని కాపాడేందుకు సరైన ప్రతిపాదనలను సిద్ధం చేయండి. పర్యావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే.. అన్ని ఫిర్యాదులను ఉపసంహరిస్తాం. నా రిటైర్మెంట్ లోపల వీటన్నింటికీ పరిష్కారం చూపాలి' అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు.
అయితే సమగ్ర ప్రణాళికను అందించేందుకు 6 వారాలు సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి కోర్టును కోరగా ఇందుకు న్యాస్థానం అంగీకరించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. నవంబర్ 24కి తన రిటైర్మెంట్ తేదీ వరకు ప్రతిపాదన తీసుకురావడానికి సమయం తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సీజేఐ సూచించారు.