తెలంగాణలో అదుపులోనే కరోనా.. అయినప్పటికీ మాస్క్ తప్పనిసరి : డీహెచ్ శ్రీనివాసరావు
Health Director Srinivasa Rao Press Meet on covid awareness.తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని,
By తోట వంశీ కుమార్ Published on 21 April 2022 11:09 AM GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందని, అయితే.. పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరోసారి విజృంభిస్తుండడం, భారతదేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు అధికమౌతుండడంతో వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే కోఠిలోని ఆయన కార్యాలయంలో డీహెచ్ మీడియాతో మాట్లాడారు. కరోనా మహమ్మారి పూర్తిగా పోలేదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మహమ్మారి అదుపులోనే ఉందన్నారు. పక్క రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు. లేకుంటే జరిమానా విధిస్తామని తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు నెలల్లో భారీ సంఖ్యలో పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 60 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరూ బూస్టర్ డోస్ వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. రెండో డోసు తీసుకున్న 9 నెలల తరువాత బూస్టర్ డోసు తీసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటి వరకు కరోనా ను నియంత్రించగలిగామని, రాబోయే రోజుల్లో కూడా ప్రజల సహకారం అవసరం ఉందన్నారు. కొవిడ్ ఎక్స్ఈ వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చునని, 2022 డిసెంబర్ నాటికి కొవిడ్ ఫ్లూ లా మారే అవకాశం ఉందన్నారు.
ఇక రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి నుంచి బయటకు రావొద్దని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే గొడుగు ఉపయోగించాలన్నారు. లేదా తలకు ఏదైనా బట్ట చుట్టుకోవాలన్నారు. నలుపు రంగు దుస్తులు ధరించకుండా, లేత రంగు దుస్తులు, కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు.