తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ టీకా తీసుకోని వారికి అలర్ట్ అంటూ ఓ వార్త హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోని వారికి వచ్చే నెల నుంచి రేషన్, ఫించన్ నిలిపివేస్తామని ఆ వార్త సారాంశం. కాగా.. ఈ వార్తను తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్) శ్రీనివాసరావు ఖండించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని ఆందోళనకు గురి కావొద్దని సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. వ్యాక్సినేషన్ పై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. తప్పుడు వార్తలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సోమవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. రాష్ట్రంలో 179 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇద్దరు మృతి చెందారు. 104 మంది బాధితులు కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,453కు చేరగా.. ఇందులో 6,62,481 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా మహమ్మారి కారణంగా 3,949మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,023 యాక్టివ్ కేసులు ఉన్నాయి.