తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి ఆదివారం సమావేశమయ్యారు. జనతాదళ్ నాయకుడు కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కలిశారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. కుమారస్వామికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. తెలంగాణ అభివృద్ధి, జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోషించాల్సిన కీలక పాత్ర, ఇతర జాతీయ రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
2024 ఎన్నికలకు ముందు భావసారూప్యత గల పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడానికి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొత్తు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్ అధినేత వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఆగస్ట్ 31న పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ , ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లతో రావు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ అధినేత గతంలో బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో చర్చించారు.
అంతకుముందు హైదరాబాద్ వచ్చిన కుమారస్వామిని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసి ఎంట్, మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారస్వామి బస చేసిన హోటల్‌కు వెళ్లిన కేటీఆర్.. ఆయనతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో అర్థవంతమైన చర్చలు జరిగినట్లు కుమారస్వామి ట్వీట్ చేశారు. అభివృద్ధిపై గొప్ప విజన్ ఉన్న నేత కేటీఆర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ, కర్ణాటకతో పాటు కీలకమైన జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు కుమారస్వామి వెల్లడించారు.