కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాలు మరికొన్ని రోజులు లాక్‌డౌన్ పొడిగిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి హర్యానా ప్రభుత్వం చేరింది. ఆ రాష్ట్రంలో మరో వారం రోజులు లాక్‌డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ రేపటితో (మే 31 తో) ముగియనుంది. ఈ నేపథ్యంలో కొన్ని సడలింపులతో లాక్‌డౌన్‌ను జూన్ 7 వరకు పొడిగిస్తున్నట్లు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు.
వాణిజ్య సముదాయాలు సరిబేసి విధానంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నడుస్తాయన్నారు. అయితే.. విద్యా సంస్థలు మాత్రం జూన్ 15 వరకు తెరిచేదిలేదని స్పష్టం చేశారు. కాగా.. యధావిధిగా రాత్రి కర్ఫ్యూ రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. హర్యానాలో నిన్న ఒక్క రోజే 1,868 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,53,937 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 7,22,711 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 8,132 కరోనాతో మరణించారు.