ఎంపీ ఎన్నికల్లో నేను లేదా నా కొడుకు పోటీ చేస్తాం: గుత్తా సుఖేందర్‌రెడ్డి
పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.
By Srikanth Gundamalla Published on 25 Oct 2023 11:30 AM ISTఎంపీ ఎన్నికల్లో నేను లేదా నా కొడుకు పోటీ చేస్తాం: గుత్తా సుఖేందర్‌రెడ్డి
తెలంగాణ శాసమండలి అధ్యక్షుడు ప్రతిపక్ష నాయకులపై విమర్శలు చేశారు. ప్రతి అంశాన్ని ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యకంతం చేశారు. నల్లగొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు.
పాము తన పిల్లలను తానే తిన్నట్లు.. తమ పార్టీ వాళ్లే ఇబ్బందులు తెస్తున్నారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యేలతో విభేదాల కారణంగానే కొందరు పార్టీ వీడుతున్నారనీ.. కానీ తనకు పార్టీ మాకే ఆలోచనే లేదన్నారు. అయితే.. ప్రస్తుత రాజకీయాల్లో కొత్త ట్రెండ్ నడుస్తోందని చెప్పారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే ప్రతిపక్ష పార్టీలు పనిగా పెట్టుకున్నాయని అన్నారు. మేడిగడ్డ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అదే చేస్తున్నాయని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సాంకేతిక పరిజ్ఞానంలో లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏమాత్రం సరికాదని గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్ సీఎం కావాల్సిందే అని అన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని.. మూడోసారి అధికారం చేజిక్కుంచుకోవాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ఇక తాను పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో తాను లేదంటే.. తన కుమారుడు పోటీ చేస్తామని వెల్లడించారు. తాను ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానన్నారు. ఈ వయసులో పార్టీలు మారాల్సిన అవసరం తనకు లేదన్నారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. తాను అనుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచే పోటీ చేసేవాడిని అనీ.. పక్క పార్టీలో చేరాల్సిన ఆలోచనే తనకు లేదన్నారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుస్తుందని నమ్మకం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితులల్లో తనపై కూడా కొన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని గుత్తా సూచించారు.