Gruhalakshmi Scheme: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త!

ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి ఎన్నికల కోడ్‌ వల్ల ఆగిన 'గృహలక్ష్మి' పథకాన్ని...

By -  అంజి
Published on : 5 Jan 2026 6:49 AM IST

Gruhalakshmi Scheme, Telangana government, build a house, Telangana

Gruhalakshmi Scheme: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి శుభవార్త!

హైదరాబాద్‌: ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చి ఎన్నికల కోడ్‌ వల్ల ఆగిన 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రభుత్వం 'ఇందిరమ్మ ఇళ్లు'లోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దీంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి కానున్నాయి. 'ఇందిరమ్మ ఇళ్లు' పథకం ప్రకటించగానే పలువురు నిర్మాణాలు మొదలుపెట్టారు. తుది జాబితాలో చోటు దక్కక కొందరు వదిలేశారు. అలా ఆగిపోయిన 'గృహలక్ష్మి' ఇళ్లు 13 వేల వరకు ఉండగా.. వాటికి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది.

గృహలక్ష్మి పథకాన్ని.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలోకి తేవాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. త్వరలోనే ఆ లబ్ధిదారుల వివరాలను పూర్తిగా పరిశీలించి, వారికి ఇందిరమ్మ పథకం కింద నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన నిర్ణయం త్వరలో వెలువడనుంది. బీఆర్‌ఎస్‌ తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకం ఉద్దేశ్యం.. సొంత స్థలం ఉన్న నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించబడింది.

గత ప్రభుత్వం డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకాన్ని అమలు చేసింది. అయితే ఆ పథకానికి నిధుల సమస్య రావడంతో.. అసెంబ్లీ ఎన్నికల ముందు గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో యూనిట్‌ కాస్ట్‌ రూ.3 లక్షలు. ఇల్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షలను కిసతీల వారీగా చెల్లిస్తామని ప్రకటించింది. అప్పటికే ఎన్నికల కోడ్‌ వచ్చింది. దీంతో కాంగ్రెస్‌ ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొస్తామని ప్రకటించింది. ఆ తొందరలో కొందరు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవడంతో ఆ పథకం పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఇళ్ల నిర్మాణం ప్రారంభించుకున్న లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల సమయంలో గృహలక్ష్మి పథకం ఇళ్లకు కూడా నిధులు కేటాయించే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉంది.

Next Story