Telangana: 'గృహలక్ష్మి' పథకానికి నేడే ఆఖరి తేదీ.. మళ్లీ ఎప్పుడంటే?

ఇళ్లు లేని పేదల కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రవేశపెట్టింది.

By అంజి  Published on  10 Aug 2023 3:30 AM GMT
gruha lakshmi scheme, Telangana, CM KCR

Telangana: 'గృహలక్ష్మి' పథకానికి నేడే ఆఖరి తేదీ.. మళ్లీ ఎప్పుడంటే?

ఇళ్లు లేని పేదల కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 'గృహలక్ష్మి' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌కి ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కాగా మొదటి విడత దరఖాస్తుల స్వీకరణకు నేడు ఆఖరు తేదీ. నేటితో గడువు ముగుస్తుండటంతో మీసేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు దరఖాస్తుదారులతో కిక్కిరిసిపోతున్నాయి. గడచిని 3 రోజుల్లో వేల సంఖ్యలో అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు తెలిపారు. దరఖాస్తుకు సమయం తక్కువగా ఉండటంతో ఇబ్బందిగా ఉందని, గడువు పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

నిబంధనల ప్రకారం గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. ఆగస్టు 20వ తేదీలోగా దరఖాస్తుదారుల వెరిఫికేషన్‌ పూర్తి చేసి, 25వ తేదీన మొదటి విడత లబ్దిదారులను ఎంపిక చేస్తామన చెప్పారు. మరోవైపు గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. సొంత భూమి ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించారని, ఈ స్కీమ్‌ని నిరంతర ప్రక్రియగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇంటి నంబర్, లేదంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. గడువు ముగిసినా.. ప్రజాప్రతినిధుల ద్వారా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి నియోజకవర్గానికి తొలి విడతలో 3 వేల ఇళ్లు కేటాయిస్తామని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి వివరించారు. మొదటి విడతలో లబ్ధి పొందని వారు నిరాశపడకుండా.. రెండో విడతలో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తు సమయంలో గృహలక్ష్మి పథకం దరఖాస్తు ఫారం, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఇంటి స్థలం దస్తావేజులు లేకపోతే ప్రస్తుత ఇంటి నెంబర్‌ ఉంటే సరిపోతుంది.

Next Story