సంచలనంగా ప్రవళిక సూసైడ్.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలన్న గవర్నర్

ప్రవళిక సూసైడ్‌ సంచలనంగా మారింది. గవర్నర్‌ తమిళిసై ఈ ఘటనపై స్పందించారు.

By Srikanth Gundamalla  Published on  14 Oct 2023 7:43 AM GMT
group-2 exams, pravallika suicide, protests, governor, telangana,

సంచలనంగా ప్రవళిక సూసైడ్.. 48 గంటల్లో నివేదిక కోరిన గవర్నర్

హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని అశోక్‌నగర్‌లో ప్రవళిక ఉంటున్న హాస్టల్‌లోనే ఆత్మహత్య చేసుకుంది. దాంతో.. విద్యార్థి సంఘాలతో పాటు ఇతర ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా ప్రవల్లిక మృతిపై స్పందించాయి. ప్రభుత్వ హత్యేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం రాత్రి ‌ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్న విషయం తెలియడంతో పెద్దఎత్తున విద్యార్థులు సంఘటనాస్థలికి చేరుకున్ని ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేసినందుకు తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుందంటూ ఆందోళన చేశారు. గవర్నర్‌ తమిళిసై కూడా ప్రవల్లిక ఆత్మహత్య ఘటనపై స్పందించారు.

ప్రవళికఆత్మహత్య ఘటనపై గవర్నర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మహత్య ఘటన తనకు చాలా బాధకలిగించిందని చెప్పారు. ఈ ఘటనపై గవర్నర్ తమిళిసై కీలక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లోగా ప్రవల్లిక మృతిపై నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్, డీజీపీ, టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రవళిక ఆత్మహత్య సంచలనంగా మారింది. ఆమె సూసైడ్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య ఘటన బాధ కలిగించిందని ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా తెలిపారు. అయితే.. ప్రవళిక ఆత్మహత్య కాదనీ.. తెలంగాణ ప్రభుత్వ హత్యే అన్నారు. తెలంగాణ యువత నిరుద్యోగంతో విలవిల్లాడుతోందని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తేనే జాబ్‌ క్యాలెండ్‌ సాధ్యం అవుతుందని చెప్పారు రాహుల్‌గాంధీ. మేం అధికారంలోకి వచ్చాక యూపీఎస్సీ తరహాలోనే టీఎస్‌పీఎస్సీని బలోపేతం చేస్తాం. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహల్‌గాంధీ ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా పేర్కొన్నారు.

ప్రవల్లిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఆమె మృతికి సంఘీభావంగా పలుచోట్ల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రవల్లిక మృతికి సంఘీభావంగా విద్యార్థులంతా ధర్నాలో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ వద్ద నిరసన తెలుపుతుండటంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా విద్యార్థులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక మరోవైపు హయత్ నగర్ వద్ద విజయవాడ జాతీయ రహదారి పై ఉద్రిక్తత నెలకొంది. TSPSC బోర్డుని రద్దు చేసి నూతన బోర్డు ఏర్పాటు చేయాలని ఆందోళనకారులు సడక్ బంద్ నిర్వహించారు. సడక్ బంద్‌లో వామపక్ష నేతలు పాల్గొన్నారు. అడ్డుకునే ప్రయత్నంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. డీసీఎం వద్ద కిందపడిపోవడంతో ఒక పోలీసుకు గాయాలు అయ్యాయి. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆందోళనకారులను బలవంతంగా వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story