Group 1 Exam: పరీక్ష ప్రారంభానికి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత
తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలోనే పరీక్ష రాసే
By అంజి Published on 5 Jun 2023 9:00 AM ISTGroup 1 Exam: పరీక్ష ప్రారంభానికి.. 15 నిమిషాల ముందే గేట్ల మూసివేత
తెలంగాణ రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలోనే పరీక్ష రాసే అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తామని తెలిపింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వబోమని అభ్యర్థులకు ముందు జాగ్రత్తగా తెలిపింది.
ఇక ఓఎంఆర్ షీట్‌లో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో సరిగ్గా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్ ఉపయోగించినా, డబుల్ బబ్లింగ్ చేసిన సమాధాన పత్రాలు పరిగణంలోకి తీసుకోబోమని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాల్సి ఉంటుంది. వీటి విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని వివరించింది.
నిన్న ఉదయం 11 గంటలకు గ్రూప్ 1 హాల్‌టికెట్లను కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గతంలో జారీ చేసిన హాల్‌టికెట్లు చెల్లవని కమిషన్ ఇప్పటికే స్పష్టంచేసింది.