తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 159 బార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Green signal for 159 new bars in Telangana. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం కొత్తగా 159 బార్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.
By Medi Samrat Published on 26 Jan 2021 4:37 PM ISTతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరికొన్ని బార్లు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో బార్లను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సోమవారం కొత్త బార్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌లు జారీ చేశారు.
కొత్తగా 159 బార్ల ఏర్పాటు
కాగా, రాష్ట్రంలో 7 కార్పొరేషన్లు, 62 మున్సిపాలిటీలను కొత్తగా ఏర్పాటైన విషయం తెలిసిందే. వీటిలో కొత్త బార్లను ఏర్పాటు చేయలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ వివరాలను సేకరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో ఏర్పాటు చేయాల్సిన బార్ల సంఖ్యను వెల్లడించింది. తాజాగా 159 కొత్త బార్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.
రాష్ట్రంలో 1211కు చేరనున్న బార్ల సంఖ్య
రాష్ట్రంలో ఇప్పటికే 1052 బార్లు ఉండగా, కొత్తవాటితో కలుపుకొని 1211కు చేరనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 400లకుపైగా బార్లు ఉండగా, మరో 55 కొత్త బార్లు ఏర్పాటు చేస్తోంది. ఇక కరీంనగర్ 6, నిజామాబాద్ 16, వరంగల్ 4, మహబూబ్‌నగర్ 10, ఖమ్మం 4, మెదక్ 11, నల్గొండ 13, రంగారెడ్డి 8, జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల్లో 19 బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక బారుకు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే జిల్లాల్లో కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్సైజ్ డైరెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా తీయనున్నారు. నాన్ రీఫండబుల్ దరఖాస్తు ఫీజును రూ.1 లక్షగా నిర్ణయించారు. అయితే జిల్లాల్లో ఫిబ్రవరి 10న, జీహెచ్‌ఎంసీలో 11న లక్కీ డ్రా తీయనున్నారు. ఎంపికైన దరఖాస్తుదారులకు ఫిబ్రవరి 17న ప్రొవిజన్ లైసెన్స్‌లు జారీ చేయనున్నారు. 90 రోజుల్లోగా దరఖాస్తుదారులు బార్ ఎక్సైజ్ టాక్స్‌లో మూడోవంతు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రభుత్వం నిర్ణయంతో మందుబాబులకు మరిన్ని బార్లు ఏర్పాటు కానున్నాయి.