చదువుల తల్లి బాసర సరస్వతి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నాలుగు గంటల సమయంలో గవర్నర్ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం తరుపున ఈవో సోమయ్య గవర్నర్‌ను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి దీవెనలతో అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకే వచ్చానని చెప్పారు. ట్రిపుల్ ఐటీలోని సమస్యలపై పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు తనకు ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం గవర్నర్ బాసర ట్రిపుల్ ఐటీకి పయనమయ్యారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో ఆర్జీయూకేటీలోకి మీడియాను పోలీసులు అనుమతించలేదు.