హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో 73వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరోనా మహమ్మారి దృష్ట్యా రిపబ్లిక్ డే వేడుకలను పబ్లిక్ గార్డెన్స్ నుండి రాజ్‌భవన్‌కు మార్చిన విషయం తెలిసిందే. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గవర్నర్ తమిళిసై మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రఝకుల, ఫ్రంట్ లైన్ వారియర్స్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు చెప్పారు. రిపబ్లిక్ డే స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాజ్యాంగ రూపకర్తలకు ఘన నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది అని, రాజ్యాంగం అందించిన దార్శనికులకు నివాళులు అర్పిస్తున్నానని తమిళిసై అన్నారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌లో ప్రపంచంలోనే ముందున్నందుకు గర్వంగా ఉందన్నారు. త్వరలోనే 200 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేసుకోబోతున్నామని చెప్పారు. హైదరాబాద్ మెడికల్ హబ్‌గా ఎదగడం సంతోషకరమన్నారు. తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా ఎదిగిందని, రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలిపిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రజలకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఆవిర్భావం నుండి సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తోందన్నారు. సమాఖ్య స్ఫూర్తిని మరింత ధృడంగా కొనసాగిస్తామని సీఎం చెప్పారు. రాజ్యాంగ స్పూర్తిని కొనసాగించేందుకు ప్రతినబూనుదాం అని సీఎం కేసీఆర్ అన్నారు.