టీఎస్ఆర్టీసీ బిల్లులో ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్

టీఎస్ఆర్టీసీ బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై వివరణ కోరారు.

By Srikanth Gundamalla  Published on  5 Aug 2023 6:05 AM GMT
Governor Tamilisai, TSRTC, Bill, Telangana, Government,

టీఎస్ఆర్టీసీ బిల్లులో ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్  

తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. బిల్లుకు ఆమోదం తెలపాలని ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. అయితే.. గవర్నర్‌ తమిళిసై నుంచి రెండ్రోజుల వరకు ఎలాంటి స్పందన లేదు. దాంతో.. ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు గవర్నర్‌ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చింది. ప్రభుత్వం పంపిన టీఎస్‌ఆర్టీసీ బిల్లును గవర్నర్ క్షుణ్నంగా పరిశీలించారని.. బిల్లులో స్పష్టత లేని అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వానికి తెలిపింది. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజల ప్రయోజనాల కోసం బిల్లులోని అంశాలపై ప్రభుత్వాన్ని స్పష్టత కోరుతున్నట్లు గవర్నర్ కార్యాలయం వెల్లడించింది.

టీఎస్ఆర్టీసీ బిల్లులో ఐదు అంశాలపై వివరణ కోరిన గవర్నర్:

1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవని గవర్నర్ తమిళిసై అన్నారు. అలాగే రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ IX ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు లేవని గవర్నర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం... వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా పెన్షన్ ఇస్తారా? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడానికి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అదే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్ ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని గవర్నర్ తమిళిసై కోరారు.

ఇదిలా ఉంటే గవర్నర్‌ తమిళిసై ఆర్టీసీ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నారంటూ కార్మికులు నిరసనలు చేస్తున్నారు. ఉదయం రెండు గంటల పాటు ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. దాంతో.. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రాజ్‌భవన్‌ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో బస్సులు ఎక్కువగా నడవటం లేదు. ఈ సమయంలో గవర్నర్ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనతో నిరసనలు ఆపుతారా..? లేదంటే కంటిన్యూ చేస్తారా చూడాలి.


Next Story