యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం యాదాద్రి క్షేత్రానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈవో గీత తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. యాదాద్రి ప్రధానాలయాన్ని సందర్శించి.. స్వయంభు మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారని అన్నారు. రాబోవు రోజుల్లో యాదాద్రి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, తెలంగాణ బడ్జెట్ ప్రజలందరికీ అనుకూలంగా ఉండాలని యాదాద్రీశుడిని వేడుకున్నట్లు చెప్పారు.
యాదాద్రీశుల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీసమేత నారసింహుడు బాలాలయంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 11రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు ఈనెల 14న ముగియనున్నాయి. స్వయంభువులైన పంచనారసింహుల ఆలయ పునర్నిర్మాణం జరుగుతుండటంతో ప్రత్యామ్నాయంగా ఏర్పాటైన బాలాలయంలో ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.