గవర్నర్ యాదాద్రి ఆలయ సందర్శన - అధికారుల ప్రోటోకాల్ స్వాగతం

Governor Tamilisai Soundararajan visits Yadadri Temple.గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర రాజన్ యాదాద్రి ఆలయాన్ని సంద‌ర్భించారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2023 12:26 PM IST
గవర్నర్ యాదాద్రి ఆలయ సందర్శన - అధికారుల ప్రోటోకాల్ స్వాగతం

తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర రాజన్ ఈ రోజు ఉద‌యం యాద‌గిరి గుట్ట శ్రీ ల‌క్ష్మీ న‌రసింహస్వామి వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ ఉద‌యం యాదాద్రికి చేరుకున్న గ‌వ‌ర్న‌ర్‌కు క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి, ఆల‌య అధికారులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆల‌యం వ‌ద్ద అర్చ‌కులు గ‌వ‌ర్న‌ర్‌కు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. నేరుగా స్వయంభు ఆయలంలోకి వెళ్లిన గవర్నర్.. స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు గవర్నర్ కు ఆశీర్వచనం చేశారు. త‌రువాత స్వామి వారి తీర్థ ప్ర‌సాదాల‌ను అందించారు.

అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ తమిళిసై సౌందర రాజన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలందరి సంక్షేమం కోసం ప్రార్థించిన‌ట్లు చెప్పారు. ఈ ఆలయం గొప్ప ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రంగా రూపు దాల్చుకోవడం ఆనందంగా ఉందన్నారు.

ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా గవర్నర్‌ తమిళిసై, కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య విభేదాలు కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు యాదాద్రి ఆల‌యాన్ని ప‌లు మార్లు గ‌వ‌ర్న‌ర్ ద‌ర్శించుకున్న‌ప్ప‌టికీ ప్రోటోకాల్ ప్ర‌కారం స్వాగ‌తం ల‌భించ‌లేదు. అయితే.. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వానికి, గవ‌ర్న‌ర్‌కు మ‌ధ్య స‌మోధ్య కుదిరింది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు ఆల‌యానికి వ‌చ్చిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై కు తొలిసారి ప్రొటొకాల్ ప్ర‌కారం స్వాగ‌తం ల‌భించింది.

నేటి నుంచి తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మ‌ధ్యాహ్నం శాసనమండలి, శాసనసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. రెండేళ్ల విరామం తర్వాత గవర్నర్ తమిళిసై శాసనమండలి, శాసనసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనుండటంతో అంద‌రిలో ఆసక్తి నెలకొంది.

Next Story