ప్రజల ఆరోగ్యానికి తోడ్పడే వంగడాలను రూపొందించాలి : గవర్నర్ తమిళిసై
Governor Tamilisai Participates Konda Laxman Horticulture University 2nd Convocation.దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు
By తోట వంశీ కుమార్
దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు, పూలు ఒక భాగమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అలాగే.. ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగాల ఉత్పత్తే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు చేయాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా గవర్నర్ పాల్గొని మాట్లాడారు.
విద్యార్థులు వ్యవసాయం, ప్రత్యేకించి ఉద్యాన కోర్సులు ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఔషద పంటలపైనా పరిశోధనలు విస్తృతం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయం పండ్లు, కూరగాయలు, పూల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించాలని, సమతుల ఆహారంలో కూరగాయలు, పండ్లు ముఖ్యమని పేర్కొన్నారు. ఉద్యాన పంటల సాగు, మార్కెటింగ్, ఎగుమతుల్లో వృద్ధి కనిపిస్తుందని తెలిపారు. పండ్లు, కూరగాయలు, పూల పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు కోసం కృషి చేయాలి. మన పూర్వీకులు సంప్రదాయ ఆహారం తీసుకున్నారని, అప్పట్లో జీవనశైలి వ్యాధులైన బీపీ, మధుమేహం లేవని గవర్నర్ అన్నారు.
తమిళనాడులో రకరకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అదే తెలుగు నేలపై పాలీష్డ్ రైస్ కు మనం అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. బియ్యం తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు, పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలని గవర్నర్ కోరారు. కరోనా సమయంలో పండ్లు, కూరగాయల ప్రాధాన్యత ఏమిటో చూశాం. మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారంగా ఉపయోగపడే వంగాల సృష్టి జరిగేలా ఉద్యాన పట్టభద్రులు నిరంతరం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది అని గవర్నర్ అన్నారు.
పర్యావరణ మార్పులు నేపథ్యంలో వ్యవసాయ ఉద్యాన పంటల ఉత్పత్తి, నాణ్యత పెంచడంలో శాస్త్ర సాంకేతికత భాగస్వామ్యం అవసరమని భారత వ్యవసాయ పరిశోధన మండలి హార్టికల్చరల్ సైన్స్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆనంద్ కుమార్ అన్నారు. మార్కెట్ ఉన్న పంటల సాగు చేయడం, కోతానంతర వ్యవసాయ నష్టాలను తగ్గించడంతో పాటు రోబోటిక్స్, డ్రోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీనోమ్ ఎడిటింగ్, బయోటెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలని సూచించారు. తక్కువ వనరులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడమే లక్ష్యంగా వ్యవసాయ అనుబంధ రంగాలలో పరిశోధనలు ముమ్మరం కావాన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్స్‌లర్ నీరజ ప్రభాకర్ వర్సిటీ ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను, జరిగిన పరిశోధనలను వివరించారు. దేశంలోనే మొదటి మహిళా వీసీగా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ :
విశ్వవిద్యాలయం రెండవ స్నాతకోత్సవంలో మొత్తం 575 మందికి డిగ్రీ పట్టాలు ఇచ్చారు. అందులో 482 అండర్ గ్రాడ్యుయేట్, 76 పోస్ట్ గ్రాడ్యుయేట్, 17 పీహెచ్.డి పట్టాలు పొందిన విద్యార్థులు ఉన్నారు. 11 మంది విద్యార్థులకు గవర్నర్ బంగారు పతకాలను అందజేశారు. పీజీలో అత్యధిక ఓజిపిఎ సాధించినందుకు గాను పల్లెర్ల సాయి సుప్రియ మూడు గోల్డ్ మెడల్స్ అందుకున్నారు. పీజీలోని అన్ని విభాగాల్లో టాపర్ గాను, మహిళల్లో టాపర్ గాను, అలాగే కూరగాయలు ఎమ్మెస్సీ కూరగాయల విభాగంలో అత్యధిక ఓ జిపిఏ సాధించినందుకు ఈ మూడు బంగారు పతకాలు సాధించారు. అలాగే ఎద్దుల గాయత్రి, స్నేహప్రియ, సంధ్యారాణి బంగారు పథకాలు అందుకున్నారు.