తెలంగాణలో ఇవాళ తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాలుగా ప్రభుత్వ స్కూళ్లను వినియోగిస్తుండటంతో ఆయా చోట్ల స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఎన్నికల ఏర్పాట్లకు గాను నిన్న కూడా ఈ పాఠశాలలకు సెలవు ఇచ్చిన సంగతి తెలిసిందే. పోలింగ్ జరిగే మండలాల్లో డిసెంబర్ 11న ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైన్స్, రెస్టారెంట్లు, బార్లు మూసి వేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కేవలం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే ఈ ఆంక్షలు అమలు కానున్నట్లు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇక రెండో విడత ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 13, 14 తేదీల్లో జరగనుండగా, ఆ రోజులు రెండో శనివారం, ఆదివారం కావడంతో అవి సాధారణ సెలవులుగా కలిసివచ్చాయి. అనంతరం మూడో విడత పోలింగ్ సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. పోలింగ్ సామగ్రిని సిద్ధం చేయడం, ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులతో పాటు కార్మికులకు సైతం వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.