రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని పర్యటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వీటి అమలు లక్ష్యాన్ని నీరుగార్చొద్దని అధికారులకు సూచించారు. నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నాలుగు పథకాలను అమలు చేయడానికి చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్లు మంత్రికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక జాగ్రత్తగా చేపట్టాలని, తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దుర్భరంగా ఉన్నప్పటికీ పథకాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందాలని ఆదేశించారు. రైతు భరోసాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ఉన్న ఏ పథకాన్ని ఎత్తి వేయటం లేదన్నారు. వాటితో పాటు ఎన్నో కొత్త పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి జూపల్లి వెల్లడించారు.