కరెంట్ బిల్లులు కడుతున్న ప్రజలు.. ప్రభుత్వమే కట్టకపోతే ఎలా?

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల ఎగవేతదారుల లిస్టులో ప్రముఖంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల బకాయిలు మొత్తం రూ.28,861 కోట్లు ఉన్నాయట.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Dec 2023 1:50 PM IST
Telangana Government offices, Telangana, current bills, Money Owed

కరెంట్ బిల్లులు కడుతున్న ప్రజలు.. ప్రభుత్వమే కట్టకపోతే ఎలా? 

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బిల్లుల ఎగవేతదారుల లిస్టులో ప్రముఖంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. ప్రభుత్వ శాఖల బకాయిలు మొత్తం రూ.28,861 కోట్లు ఉన్నాయట. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో రూ.1,268 కోట్ల బకాయిలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు ఆ బిల్లులకు సంబంధించి గణనీయమైన పెరుగుదల కనిపిస్తూ ఉంది.

ప్రభుత్వ శాఖలు ఎందుకు చెల్లించడం లేదు?

ప్రభుత్వ శాఖలు, ప్రాజెక్టులు భారీగా విద్యుత్ బిల్లులను పెండింగ్ పెట్టడంతో విద్యుత్ శాఖపై ఊహించని భారం పడుతోంది. ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు బకాయిలు రూ.14,172 కోట్లు ఉన్నాయి. మిషన్ భగీరథ వంటి తాగునీటి సరఫరా కోసం నిర్మించిన ఇతర ప్రాజెక్టుల కారణంగా రూ.3,559 కోట్లు చెల్లించలేదు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (HMWS&SB) పెండింగ్ మొత్తం రూ. 3,932 కోట్లు ఉంది. రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీలు రూ.486 కోట్లు బకాయిలు ఉన్నాయి. హోం శాఖ రూ.28 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉన్నది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూ.48 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. ఇతర శాఖలు రూ.77 కోట్ల విద్యుత్ ప్రభుత్వానికి బకాయిపడ్డాయి.

పెండింగ్ కొనసాగుతూనే ఉంది:

మునుపటి సంవత్సరాలలో బిల్లులు చెల్లించకపోవడంతో అవి కాస్తా భారీగా పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.721 కోట్లు బకాయి పడ్డాయి కేంద్ర సంస్థలు. పంచాయతీరాజ్ శాఖ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సంవత్సరం నుండి పెండింగ్ బకాయిలు కాకుండా, కొన్ని ప్రభుత్వ శాఖలు ఇకపై బిల్లులపై వడ్డీ కూడా కట్టాల్సి ఉంది. అలా కట్టకుండా నాన్చుతూ వెళ్లడం భారీగా డబ్బులు పెండింగ్ పడడానికి కారణమైంది. అలా ఆలస్యం చేస్తూ రావడం.. ఇప్పుడు విద్యుత్ పంపిణీ సంస్థలకు కష్టకాలంగా మారింది.

ప్రజలు కరెంట్ బిల్లులు కడుతున్నారు.. ప్రభుత్వమే కట్టడం లేదు:

రాష్ట్ర ప్రజలు తమ కరెంటు బకాయిలు చెల్లిస్తుండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్రంపై పెనుభారం పడుతోంది. ఈ శాఖలు ఎందుకు బిల్లులు చెల్లించలేదో అధికారులు సరైన కారణాలు కూడా చెప్పడం లేదు.

విద్యుత్ సంస్థలకు చాలా నష్టం

ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌/టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) ప్రభుత్వ బకాయిలతో కలిపి ఏకంగా రూ.50,275 కోట్ల భారీ నష్టాన్ని చవిచూసించింది. ప్రభుత్వానికి పంపిన నివేదికలలో కూడా విద్యుత్ పంపిణీ సంస్థలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లిస్తే, ఈ విద్యుత్ సంస్థల నష్టాలు రూ.9,620 కోట్ల వరకు గణనీయంగా తగ్గుతాయి. కొత్త ప్రభుత్వం వచ్చే ఐదేళ్లలో వాయిదాల వారీగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అది జరుగుతుందో లేదో చూడాలి.

ప్రభాకర్ రావు రాజీనామా:

ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి దేవులపల్లి ప్రభాకర్‌ రావు ఇటీవల రాజీనామా చేశారు. తొమ్మిదిన్నరేండ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 22 ఏండ్ల వయస్సులోనే విద్యుత్‌ శాఖలో చేరిన ఆయన 2014, జూన్‌ 5న జెన్‌కో సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది అక్టోబర్‌ 25న ట్రాన్స్‌కో ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. తొలుత ఆయన్ను రెండేండ్ల పదవీ కాలానికి సీఎండీగా ప్రభుత్వం నియమించినప్పటికీ.. తర్వాత పదవీ కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఉన్నట్లుండి ఆయన రాజీనామా చేయడంతో బకాయిల గురించి వెల్లడించడానికి ఇష్టపడకపోవడమేననే సందేహాలు తలెత్తుతున్నాయి. శాఖలకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులను గుర్తు చేయడం ద్వారా తాను తన బాధ్యతను నిర్వర్తించానని కొత్త ప్రభుత్వానికి ఆయన చెప్పినట్లు వర్గాలు తెలిపాయి.

విద్యుత్ శాఖలో కొత్త నియామకాలు

ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ)గా సయ్యద్‌ అలీ ముర్తజా రిజ్వీ నియమితులయ్యారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనను సీఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో రిజ్వీ కొనసాగుతారని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రిజ్వీ విద్యుత్ పంపిణీ సంస్థలో కొద్దికాలం పనిచేశారు.

Next Story