హైదరాబాద్: కాళోజి నారాయణరావు యూనివర్సిటీ అఫ్ హెల్త్ సైన్సెస్ ఇంచార్జ్ వీసీగా డా. రమేష్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. రమేష్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపల్ గా పని చేస్తున్నారు. గతంలో డీఎంఈగా పని చేశారు.
కాగా నవంబర్ 29న కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్‌రెడ్డి ఆ పదవికి రాజీనామా చేసిన తెల్లారే తిరిగి విధులకు హాజరు కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. అక్రమమార్గంలో విద్యార్థులను పాస్ చేశారని ఆరోపణలు రావడం, విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న క్రమంలో నందకుమార్‌రెడ్డి వీసీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం రాజీనామా చేసి శనివారం తిరిగి విధుల్లో చేరి, కొత్త వీసీ వచ్చే వరకు తననే ఆపద్ధర్మ వీసీగా కొనసాగమన్నారని మీడియాతో చెప్పారు. తాను ఏ తప్పుచేయలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమేనని పేర్కొన్నారు.