ఆర్టీసీ ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందించిన స‌జ్జ‌నార్..!

Good news to TSRTC employees.ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఆ సంస్థ ఎండీ స‌జ్జ‌నార్ తీపి క‌బురు అందించారు. ఆయ‌న బాధ్య‌త‌లు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Oct 2021 6:01 AM GMT
ఆర్టీసీ ఉద్యోగుల‌కు తీపి క‌బురు అందించిన స‌జ్జ‌నార్..!

ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఆ సంస్థ ఎండీ స‌జ్జ‌నార్ తీపి క‌బురు అందించారు. ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి నెల‌లోనే ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించారు. ఈ నెల నుంచి ఆర్టీసీ ఉద్యోగుల‌కు ఒక‌టో తేదీనే జీతాలు అందే ఏర్పాట్లు చేశారు స‌జ్జ‌నార్‌. ప్ర‌తి నెల ప‌ది, ప‌దిహేను రోజుల ఆల‌స్యంగా వేత‌నాలు అందుకుంటున్న‌ ఉద్యోగుల‌కు నిజంగా ఇది తీపి క‌బురు అనే చెప్పాలి. దీంతో మూడేళ్ల త‌రువాత ఒక‌టో తేదీనే ఆర్టీసీ ఉద్యోగులు జీతాలు అందుకోనున్నారు. శుక్ర‌వార‌మే వారి ఖాతాల్లో జీతాలు ప‌డ‌నున్నాయి.

వాస్తవానికి 2018 డిసెంబర్‌ వరకు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రతినెలా ఒకటో తేదీకి ఇటూ ఇటుగానే జీతాలు అందేవి. అయితే.. క‌రోనా, లాక్‌డౌన్ కార‌ణంగా సంస్థ ఆర్థిక ప‌రిస్థితి దిగ‌జార‌డంతో ప్ర‌తి నెలా 7 నుంచి 14లోపు విడ‌త‌లు, జోన్ల వారీగా జీతాలు అందిస్తున్నారు. ఇక గ్రేట‌ర్ హైదరాబాద్‌ జోన్, బస్‌భవన్‌ ఉద్యోగులకైతే సెప్టెంబ‌ర్ 20న జీతాలు అందాయంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ఉద్యోగులు స‌కాలంలో ఈఎంఏలు, ఇత‌ర ఖ‌ర్చుల కోసం ప్ర‌తి నెల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. ఎండీగా స‌జ్జ‌నార్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే ఈ విష‌యంపై దృష్టి పెట్టారు. బ్యాంకుల‌తో చ‌ర్చించారు.

ప్రతినెలా ఒకటో తేదీలోపు రూ.100 కోట్ల ఓవర్‌డ్రాఫ్టు ఇవ్వాలని.. డిపోల్లో రోజువారీ టికెట్‌ కలెక్షన్‌ ఖాతాలను సదరు బ్యాంకులో తెరుస్తామని ప్రతిపాదించారు. దీనికి ఓ ప్రభుత్వరంగ బ్యాంకు ఓకే చెప్పింది. అక్టోబర్‌ ఒకటిన జీతాల చెల్లింపు కోసం రూ.100 కోట్లు అందించింది. రోజువారి టికెట్ల ఆదాయం నుంచి కానీ.. ప్రభుత్వం నుంచి వచ్చే మొత్తం నుంచి కానీ తిరిగి ఈ సొమ్మును బ్యాంకుకు చెల్లించ‌నున్నారు.

దీర్ఘ‌కాలిక సెల‌వులకు ఓకే..

టీఎస్ఆర్టీసీలో డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్లకు దీర్ఘకాలిక సెల‌వులు ఇచ్చేందుకు సంస్థ ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సెల‌వుల‌పై అప్ర‌క‌టిత ఆంక్ష‌లున్నాయి. తాజాగా వాటిని స‌డ‌లిస్తూ.. ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఏడాది సెల‌వులు ఇస్తామంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Next Story
Share it