ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేసుకుంటూ వస్తోంది. అయితే పథకాలకు అర్హులుగా గుర్తించేందుకు ప్రభుత్వం.. రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుంటోంది. దీంతో రేషన్ కార్డులు లేక చాలా కుటుంబాలు ఆ పథకాల ఫలితాలు పొందలేకపోతున్నాయి. దీంతో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఎప్పుడా? అని ఆశగా ఎదురుచూస్తున్న వారికి మంత్రి ఉత్తమ్ గుడ్‌న్యూస్ చెప్పారు.
త్వరలోనే రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహాకాలు చేస్తోందన్నారు. రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వేర్వేరుగా ఇస్తామని ఆయన వివరించారు. కరీంనగర్‌లోని బొమ్మకల్‌లో రైతు భరోసా పథకంపై ఏర్పాటు చేసిన రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ ఈ ప్రకటన చేశారు. మంత్రివర్గంలో కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలపై త్వరలోనే చర్చిస్తామని తెలిపారు. మార్గదర్శకాలు ఖరారైన వెంటనే ప్రక్రియ ప్రారంభించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డులు అందించలేదు. దీంతో చాలా మంది రేషన్ కార్డు లేక ఇబ్బంది పడుతున్నారు.