డిసెంబర్ 28 నుంచి ప్రజాపాలనలో భాగంగా ఆరు గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ ఆరు గ్యారంటీలకు రేషన్‌కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ 150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారంటీలకు ప్రజలు దరఖాస్తు చేసుకుంటే.. అర్హులను గుర్తించి న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజాపాలన సందర్భంగా స్వీకరించే దరఖాస్తులను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కొత్త రేషన్ కార్డులు చేర్చడం లేదా పాత రేషన్ కార్డులు తీసేయడం చేయలేదన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని, లబ్ధిదారులు ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని వెల్లడించారు. ఆశావహుల డేటా సేకరణ కోసం మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు 25వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.