హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ సిద్ధం అవుతోంది. సంక్రాంతి నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల ఆదాయ పరిమితి, ఇతర అర్హతలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గతంలో ఉన్న మార్గదర్శకాల్లో మార్పులు చేయనున్నారు. ఆదాయ పరిమితి కొంత పెంచాలని అధికారులు ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ వారంలో కేబినెట్ సమావేశం జరగనుందని తెలుస్తోంది. ఈలోపే నూతన మార్గదర్శకాలను ఖరారు చేయనున్నారు అధికారులు. పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రతిపాదనలపై కేబినెట్ చర్చించి ఫైనల్‌గా నిర్ణయం తీసుకోనుంది.
సంక్రాంతి పండుగకు అటు ఇటుగా ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది వరకు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితి రూ.1.50 లక్షలు ఉండగా, పట్టణాలు, నగరాల్లో రూ.2 లక్షలుగా ఉంది. ప్రస్తుతం ఉన్న వార్షిక ఆదాయ పరిమితిని రూ.10 నుంచి 20 వేల వరకు పెంచే ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. ఇక భూమి విషయానికి వస్తే.. 3.5 ఎకరాల్లో పొలం, 7.5 ఎకరాల్లోపు మెట్ట భూమి అర్హతలుగా గతంలో ఉన్నారు. రాష్ట్రంలో 89.99 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. 2.82 కోట్ల మంది లబ్ధిదారులుగా ఉన్నారు.