తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే రుతుపవనాల రాక
తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు తెలంగాణలోకి నైరుతు రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని
By అంజి
తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్.. రేపే రుతుపవనాల రాక
తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. రేపు తెలంగాణలోకి నైరుతు రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ప్రకటించింది. వచ్చే మూడు రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని మరిన్ని ప్రాంతాలకు రుతు పవనాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి కింది స్థాయిలో గాలులు వీస్తున్నట్లు తెలిపింది. గత వారం రోజుల నుంచి వీస్తున్న వేడిగాలులు.. ఈ రోజు కూడా వీయనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. గురువారం నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తున్నది. జూన్ 10 వరకే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. నేడు రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నిన్న రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిసి చల్లని వాతావరణం ఉంది. నిన్న ములుగు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. వెంకటాపురం, వాజేడు, గోవిందరావుపేట, ములుగు, వెంకటాపూర్ మండలాల్లో వర్షం పడింది. వడగాలులు, తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో వర్షం పడటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, గుండాల మండలాల్లో ఉరుములు మెరుపులతోకూడిన వర్షం పడింది.
ఇదిలా ఉంటే.. వర్షాల ఆలస్యంపై రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పంటల సాగుకు సమయం మించిపోలేదని చెబుతున్నారు. రేపటిలోగా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నదని, విత్తనాలు విత్తేందుకు రైతులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు.