ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!
స్టీల్, సిమెంట్‌పై జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది.
By అంజి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!
స్టీల్, సిమెంట్‌పై జీఎస్‌టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది. ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం కాగా.. సంచి ధర రూ.330 - 370గా ఉంది. జీఎస్టీ తగ్గడం ద్వారా సంచిపై రూ.30 చొప్పున రూ.5,500 ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు 1500 కిలోల స్టీల్ అవసరం పడుతుండగా.. కిలో రూ.70 నుంచి రూ.85 వరకు పలుకుతోంది. కిలోపై రూ.5 తగ్గినా రూ.7,500 ఆదా కానుంది. మొత్తం రూ.13 వేల వరకు తగ్గనుంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో 3.18 లక్షల ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకు 2.05 లక్షల ఇళ్లు గ్రౌండింగ్ అయ్యాయి. వీటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలో జీఎస్టీ తగ్గనుండటంతో సిమెంట్, స్టీల్ ధరలు పెంచాలని పలు కంపెనీలు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక వేళ ధరలు పెంచితే మాత్రం జీఎస్టీ తగ్గినా సిమెంట్, స్టీల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సిమెంటు, స్టీలు పరిశ్రమల యజమానులు, అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలోని స్టీలు, సిమెంటు పరిశ్రమలను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామన్న భట్టి.. మానవీయ కోణంలో ఆలోచించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి స్టీలు, సిమెంటు ధరలను తగ్గించి ఇవ్వాలని కోరారు. కంపెనీలన్నీ ఒకే ధరకు సిమెంటు, స్టీలును సరఫరా చేయాలన్నారు. 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సుమారు 50 లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు, 27.75 లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరమవుతుందని అధికారులు పరిశ్రమల యజమానులకు వివరించారు. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వీలైనంత త్వరగా సమావేశమై ధరలను ఫైనల్ చేస్తామని స్టీలు, సిమెంటు పరిశ్రమల యాజమాన్యాల ప్రతినిధులు తెలిపారు.