తెలంగాణలోని గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్‌న్యూస్. మహాలక్ష్మీ పథకంలో భాగంగా రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకంపై పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. 18.86 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారని, ఏప్రిల్ 13 నాటికి కొందరు రెండో రాయితీ సిలిండర్ కూడా పొందారని సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. మొత్తంగా 21,29,460 గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు. ఈ క్రమంలోనే అర్హులకు రూ.59.97 కోట్ల సబ్సిడీ ఇచ్చినట్టు తెలిపింది.
ప్రజాపాలన ద్వారా మహాలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 39.33 లక్షల మంది గ్యాస్ వినియోగదారులను రూ.500 సిలిండర్ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఫిబ్రవరి 27 నుంచి ఈ పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకంతో మూడు నెలల్లోనే సిలిండర్ల వినియోగం పెరిగిందని పౌరసరఫరాలశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.