Telangana: ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు.. లబ్ధిదారులకు కొత్త డిజిటల్ కార్డులు
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది.
By అంజి Published on 19 July 2023 7:23 AM ISTTelangana: ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు.. లబ్ధిదారులకు కొత్త డిజిటల్ కార్డులు
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులకు కొత్త డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ డిజిటల్ కార్డులను స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాలోని లబ్ధిదారులకు అందించనుంది. ఆరోగ్యశ్రీ సేవలను పొందే రోగులకు ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పర్మిషన్ ఇచ్చింది. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ కార్యాలయంలో మంత్రి హారీష్‌రావు ఆధ్వర్యంలో బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీలో బయోమెట్రిక్ విధానంలో కొంత ఇబ్బంది ఎదరవుతున్న నేపథ్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అమల్లోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
కొత్త కార్డులను అందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వం త్వరలో అందించనున్న ఆరోగ్య శ్రీ కార్డు ముందుభాగంలో లబ్ధిదారు పేరు, పుట్టిన తేదీ, లింగం, కార్డు నంబర్ వంటి ప్రాథమిక వివరాలు ఉండనున్నాయి. ప్రభుత్వ లోగో, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లోగో, సీఎం కేసీఆర్ ఫొటో ముద్రించనున్నారు. స్కాన్ చేస్తే సమగ్ర వివరాలు తెలిసేలా క్యూఆర్ కోడ్‌ను కూడా కార్డ్‌పై ముద్రిస్తారు. వెనకభాగంలో ఆరోగ్యశ్రీ ఉపయోగాలు ఉంటాయి. నిమ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ల ద్వారా ఆరోగ్యశ్రీ కేసుల మెడికల్ ఆడిట్ నిర్వహించాలన్నారు.
కోవిడ్ టైంలో రికార్డ్ స్థాయిలో 856 బ్లాక్‌ఫంగస్ సర్జరీలను నిర్వహించిన కోఠి ఈఎన్టీ ఆస్పత్రికి 1.30 కోట్ల రూపాయల అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు. పిల్లల వినికిడి సమస్య పరిష్కారానికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు ప్రస్తుతం కోఠి ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రభుత్వం ఉచితంగా చేస్తోంది. అయితే త్వరలో వరంగల్ ఎంజీఎంలోనూ ఈ సర్జరీలను చేసేందుకు వీలుగా కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో డయాలసిస్ సేవలు మరింత నాణ్యంగా అందించేందుకు.. ఆన్‌లైన్‌లో పర్యవేక్షించేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించి, వినియోగించేందుకు బోర్డు పర్మిషన్ ఇచ్చింది.