రైతు పొలంలో బంగారు విగ్రహం..
Golden Statue found in farmer farm.ఓ రైతు పొలంలో బంగారు మల్లన్న విగ్రహం దొరికింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం
By తోట వంశీ కుమార్ Published on 5 Jun 2021 10:34 AM GMTఓ రైతు పొలంలో బంగారు మల్లన్న విగ్రహం దొరికింది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బంగారు మల్లన్న విగ్రహాం లభ్యం కావడంతో.. ఆ విగ్రహాన్ని గుడిలో ఉంచి పూజలు చేస్తున్నాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముప్పనపల్లి గ్రామానికి చెందిన బిల్ల నారాయణ అనే రైతు కుటుంబసభ్యులు, అదే మండలంలోని బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి తన పొలంలో మే 26న గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు.
తవ్వకాలు జరిపినచోట ఏదో జంతువును కూడా బలి ఇచ్చినట్లు ఆధారాలు ఉన్నట్లు ఆఫీసర్లు గుర్తించారు. ఈ తవ్వకాల్లో సుమారు 500 గ్రాముల బరువు ఉన్న బంగారు మల్లన్న దేవుని విగ్రహం బయటపడింది. ఈ విషయం శుక్రవారం గ్రామస్థులకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ నిమిత్తం బిల్ల నారాయణ ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు పూజ గదిలోని దేవుడి చిత్రపటాల వద్ద మల్లన్న దేవుని విగ్రహం కూడా పెట్టి పూజలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై నారాయణను ఎంక్వైరీ చేయగా తమ తాతముత్తాల నుంచి మల్లన్న దేవున్ని పూజిస్తున్నామని, ఓ రోజు కలలో కనపడి పొలంలో తన విగ్రహం ఉందని, తవ్వి తీయాలని చెప్పడంతో తీసినట్లు పేర్కొన్నారు.
మల్లన్నతోపాటు మరిన్ని విగ్రహాలు తవ్వకాల్లో దొరికినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శనివారం మరింత విచారణ జరిపి పూర్తి వివరాలను వెల్లడిస్తామని, అప్పటివరకు విగ్రహాన్ని నారాయణ ఇంటిలోనే పెట్టామని తహసీల్దార్ దేవ్‌సింగ్ తెలిపారు.